మన దేశంతో సహా ప్రపంచంలోని ఏ దేశ భవిష్యత్తు అయినా ప్రజలకు ఆహారాన్ని అందించే సామర్ధ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ దేశపు నేల ఆరోగ్యంపైన అన్నమాట. నేల కోట్లాది మొక్కలకు, జంతువులకు ఆవాసంగా ఉంటుంది. ఇవి తిరిగి మనిషి ఉనికికి భద్రత కల్పిస్తాయి. కనుక నేల ఒక వనరుగా జీవావరణ, ఆర్థిక, సామాజిక విలువలను కలిగి ఉంటుంది. మనదేశంలో నేల ఎలా ఉంది? ఇప్పుడున్న దానికంటే రెట్టింపు జనాభాకు కూడా మన దేశం అన్నం పెట్టగలదని వ్యవసాయ శాస్తవ్రేత్తలు అంటున్నారు. అయితే అది నేలలను సరిగా నిర్వహించినపుడు మాత్రమే! కానీ ఇప్పుడు నిర్వహణ ఏమాత్రం సరిగాలేదు. మనదేశంలో 25 మిలియన్ల హెక్టార్ల మేర నేల పూర్తిగా క్షీణింది. పెద్దఎత్తున నేల కోత జరగడం, నీళ్లు నిలవడం దాంతో నేలలు చవుడు నేలలుగా మారడం, రసాయన ఎరువులు, పురుగుమందులను మోతాదుకు మించి ఎక్కువగా వాడడం వంటివి ఇందుకు ప్రధానమైన కారణాలుగా నిలుస్తున్నాయి.
మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వందల హెక్టార్ల ప్రాంతంలోని సారవంతమైన పైమట్టి కొట్టుకుపోతోంది. నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి విలువైన పోషకాలు పైమట్టితో పాటు ప్రతి ఏటా కొట్టుకుపోతున్నాయి. నేలకోతకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ అడవులు క్షీణించిపోవడమే ప్రధానమైన కారణం అవుతోంది. మనదేశంలో 1980 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచే పథకాలను ప్రవేశపెట్టారు. ప్రతిఏటా మిలియన్ హెక్టార్ల అడవులను మనం కోల్పోవడమే ఇందుకు కారణం. స్థానిక పల్లె ప్రజల మ ద్దతుతో సామాజిక అటవీ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. అదేసమయంలో దేశం అంతటా ఎనిమిది బిలియన్ల చెట్లను నాటి పోషించాలనే భారీ కార్యక్రమాన్ని కూడామొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలన్నిటినుంచి డివిడెండ్లు లభించాయి. గత కొన్ని దశాబ్దాలలో పచ్చదనం మన దేశంలో పెరగడం మొదలైంది. తరిగిపోయిన అడవులకు మళ్లీ జీవం పోయడంలో ఈ ప్రయత్నాలు సఫలం అయినప్పటికీ దట్టమైన అడవుల్లో నేలలు మాత్రం కుంచించుకపోవడం ఆగలేదు. మనదేశంలో పూర్తిగా క్షీణించిన నేలల్లో అధికారిక రికార్డుల ప్రకారం అటవీ భూములున్నాయి. వీటిలో మచ్చుకు ఒక్క చెట్టు కూడా లేదు!
జీవ వనరులు: ఈ నేలమీద మొక్కలు, జంతువులు పుట్టినప్పటినుంచే ఒక అద్భుతమైన జీవ వైవిధ్యానికి అంకురార్పణ చేసాయి. మిలియన్ల సంఖ్యలో మొక్కలు, జంతువుల జాతులు ఈ నేలమీద ఉన్నా యి. మళ్లీ ఒక్కో జాతిలోనే ఎంతో వైవిధ్యం ఉంది. ఉదాహరణకు ప్రపంచంలో కేవలం ఒక్క వరిలోనే 120,000 రకాలున్నాయి. ఈ వైవిధ్యమే మనందరికీ చెందిన ఆస్తి. మన ఉనికికి ఈ జీవ వైవిధ్యమే బీమా వంటిది. మనకు ఉపయోగపడే కొత్త రకాల మొక్కలు, జంతువులను పెంచడం పెరుగుతున్న ఈ పరిస్థితిల్లో ప్రకృతి మనకిచ్చిన జన్యు నిధిని కాపాడుకోవడం మన కర్తవ్యం.
చెట్లు ఏం చేస్తాయి...నేలమీద జరిగే జీవావరణ ప్రక్రియలు అన్నింటికి చెట్ల మద్దతు ఉంటుంది. ఆరోగ్యవంతమైన వృక్ష సమూహం పూర్తిగా క్షీణించిన ఆవరణ వ్యవస్థను సైతం పునరుజ్జీవించేలా చేయగలదు. పచ్చని ప్రాంతాలు నగర, పల్లె ప్రాంతాల్లో ఈ మార్పులను తీసుకు రాగలవు. భూగర్భ నీటి మట్టాన్ని రీచార్జి చేస్తాయి. వరదలు, భారీ వర్షాల సమయంలో నేల కోతను అరికడతాయి. తుపానులు వచ్చినపుడు గాలి తాకిడిని తగ్గిస్తాయి. సముద్రపు నీరు లోపలికి చొచ్చుకు రాకుండా ఆపుతాయి. సునామీ వంటి ఉపద్రవాలు వచ్చినపుడు ప్రమాద స్థాయిని తగ్గిస్తాయి. కర్బనాన్ని పీల్చుకుని వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గిస్తాయి.
నీటిపారుదల: వరమా? శాపమా?
పంటలు పండేందుకు పొలాలకు నీళ్లు అవసరం. నీటిపారుదల కాల్వలు రైతులకు కావలసిన నీళ్లను అందిస్తాయి. అయితే ఇవి పచ్చని పొలాలను నీళ్లు నిలిచిపోయిన చవుడు నేలలుగా కూడా మార్చేయగలవు. కాల్వలు వుండే ప్రాంతాల్లో పొలాలు సాధారణంగా చదునుగా ఉండి, నీళ్లు సులభంగా బయటికిపోలేవు. ఫలితంగా పొలాల్లోకి వచ్చిన నీరు ఎక్కువ కాలంపాటు అలాగే వుంటాయి. దానివల్ల నేలలు ఉప్పురికి సారాన్ని పోగొట్టుకుంటాయి.
రసాయన సంక్షోభం
నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు మన దేశపు నేలల్లో తక్కువ. కనుక ప్రభుత్వం కూడా మన రైతులను దిగుబడి పెంచుకునేందుకు పెద్దమొత్తాల్లో రసాయన ఎరువులు వాడేలా ప్రోత్సహించింది. కాని కాలం గడిచేకొద్దీ ఈ రసాయన ఎరువులను విచక్షణా రహితంగా వాడడంతో నేల సారానికి ఇవి ప్రమాదకరంగా మారాయి. పురుగుల మందు పరిస్థితి ఇంతే. మనదేశంలో వ్యవసాయానికి లక్ష మెట్రిక్ టన్నుల పురుగు మందుల డిమాండ్ ఉంది. అలాగే ప్రజారోగ్యం కోసం మరో 50వేల మెట్రిక్ టన్నుల పురుగు మందుల అవసరం ఉంది.
జీవావరణ వ్యవస్థలో మార్పులు కలిగించే సత్తా ఈ రసాయనాలకు ఉంది. వాటిలో ఎక్కువ మనకు విషమే. మరికొన్ని ఆహార చక్రాల్లో గాఢతను సంతరించుకుంటున్నాయి. ఒక్కసారి పంట పొలం మీద జల్లిన తర్వాత ఈ పురుగుమందుల ప్రయాణం మొదలవుతుంది. వీటిలో కొంత మొక్కల్లో చేరుతుంది. కొంత భాగం జంతువుల, కీటకాల, పురుగుల నేలలో ఉన్న సూక్ష్మ క్రిముల శరీరంలోకి చేరుతుంది. నేలసారానికి అవసరమయ్యే సూక్ష్మజీవులన్నింటినీ చంపి ఇవి నేల ఆరోగ్యానే్న దెబ్బతీస్తాయి. ఒక గ్రాము నేలలో మిలియన్ల సంఖ్యలో సూక్ష్మజీవులుంటాయి. మొక్కల జీవితానికి ఇవి ఆధారంగా ఉంటాయి. పురుగుల మందు లు ఈ సూక్ష్మజీవులను చంపడంతోపాటు పర్యావరణంలో దీర్ఘకాలంపాటు కొనసాగుతాయి. ఆహార చక్రాల్లో కొనసాగుతాయి. జంతువుల కొవ్వు కణాల్లో చేరి ఆహార చక్రంలో పైస్థాయిలకు చేరతాయి. ఈ కారణంగానే తల్లిపాలలో కూడా వీటి అవశేషాలు కనిపించాయి.
ఆరోగ్యానికి ముప్పు: ఈ విషాలతో నేల కలుషితమైతే మన శరీరాలు మాత్రం మామూలుగా ఎలా ఉంటాయి. ఈ విషాలు మన శరీరంలో జీవ ప్రక్రియపై ప్రభావం చూపుతాయి. క్యాన్సర్, కాలేయం దెబ్బతినడం, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మార్పులు, పార్కిన్సన్, అల్జీమర్స్ వంటి నరాల సంబంధ వ్యాధులు పెరగడానికి ఈ విషాలే కారణమని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మన భారత ఉపఖండం వైవిధ్యమైన జీవావరణ ప్రాంతాలతో వైవిధ్యమైన జీవులకు నిలయంగా ఉంది. మనదేశంలో 15వేల మొక్క జాతులను, 75వేల జంతు జాతులను ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. ప్రపంచం మొత్తంమీద ఉన్న నేలలో మనదేశం రెండు శాతాన్ని మాత్రమే ఆక్రమించినప్పటికీ, ఈ భూమి మీద వున్న జీవజాతుల్లో అయిదు శాతానికి ఆశ్రయం కల్పిస్తోంది. సుసంపన్నమైన జీవవైవిధ్యం ఆర్ధిక వ్యవస్థకు ఎంతో ఆసరా ఇస్తుంది. దురదృష్టవశాత్తు మానవ కార్యకలాపాలవల్ల ఈ సంపదను మనం పోగొట్టుకుంటున్నాం. ఎన్నో మొక్కల జాతులు పూర్తిగా అంతరించిపోతున్నాయి. వాటి విలువ ఏమిటో మనకు తెలియకముందే అవి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. వేటాడడంవల్ల, వన్య ప్రాణుల ఉత్పత్తులకు వున్న డిమాండ్ వల్ల వన్యప్రాణులు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఆవాసాలు కోల్పోవడంవల్ల, తడినేలలు కనుమరుగుకావడంవలన మన దేశంలో పక్షి జాతుల సంఖ్య కూడా తగ్గుతోంది.
Tuesday, 24 December 2013
నేల కలుషితమైతే పర్యావరణం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment