Friday, 27 December 2013

Neeti gandam

శామీర్‌పేట : జిల్లాలోని అత్యంత పెద్ద చెరువు నేడు నీళ్లు తగ్గి వట్టిపోతున్నది. పన్నెండు వం దల ఎకరాల్లో విస్తరించి 2600 ఎకరాల ఆయకట్టున్న ఈ మినీ రిజర్వాయర్ ఇప్పుడు 200 ఎకరాలకు నీళ్లించేందుకు అవస్థలు పడుతున్నది. ప్రభుత్వం హామీలిచ్చి ఆశల్లో నాన్చడం తప్పితే ఈ చెరువుకు చేసింది లేదు. ఈ ప్రాంతంలో ఆశాజనకంగా వానలు కురిసిందీ లేదు. ఫలితంగా ఎండాకాలం రాకముందే కనిష్ట స్థాయికి నీటిమట్టం పడిపోయి రైతులు సాగుకు దూరం కావాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నవి.
భారీ చెరువు.. చెరువు నిండా నీళ్లు.. చెరువు గట్టుపై మైసమ్మ గుడి.. ఎప్పుడు చూసినా వందలాది వాహనాలు.. మాంసం ఘుమఘమ లతో ముక్కుపుటాలదిరే విందు వాతావరణం. పర్యాటక ప్రాంతాన్ని తలపించేలా పరిసరాలు.. ఎప్పుడూ హడావుడిగా కనిపించే శామీర్‌పేట పెద్ద చెరువు ఇప్పుడు నీళ్లు లేక విహీనంగా కనిపిస్తున్నది. శామీర్‌పేటలో రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న ఈ చెరువుకు 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి జవహర్ సరస్సు గా నామకరణం చేశారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఆ తర్వాత దీని అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోలేదు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. వాన నీరు రాక, వివిధ మార్గాల ద్వారా నీటిని రప్పిస్తామన్న హామీలు అమలు కాక, పెద్ద పెద్ద బండరాళ్లు తేలి చెరువు నేడు బోసిగా దర్శనమిస్తున్నది.
విస్తీర్ణం 1200 ఎకరాలు
శామీర్‌పేట పెద్ద చెరువు పరిధి 1200 ఎకరాలు. లోతు 33 అడుగులు. చెరువు పరిధిలో 70 శాతం రాక్ ఏరియానే(బండరాళ్లుండే ప్రాం తం). చెరువు శిఖంలోనూ 50 శాతం బండరాళ్లుంటాయి. ఆయకట్టు పరిధి 2600 ఎకరాలు.. రాళ్లతో కూడిన ఈ చెరువు ఎంత బాగా నిండినా తెగిపోయే ప్రమాదం ఎన్నడూ కలగలేదు. ఇక నీటి పరిమాణం ఎంతో కొలిచేందుకు ప్రత్యేకంగా స్కేలు లాంటిదేమీ లేదు. చెరువు మధ్యలో ఉన్న ఏడు గజాల ఎత్తున్న గుండు మునిగితే చెరువు నిండా నీళ్లొచ్చినట్టు. అప్పుడు ఖరీఫ్, రబీకి సరిపడా పంటలకు నీళ్లందుతాయి. శామీర్‌పేటతో పాటు మండలంలోని బాబాగూడ, అలియాబాద్, జగ్గంగూడ, కేశవ రం, ఉద్దెమర్రి, నల్గొండ జిల్లా పరిధిలోని 10 గ్రామాలకు సాగునీరందుతుంది. చెరువు కింది ఆయకట్టు 2600 ఎకరాల్లో సాగవడమేకాకుండా, మరో మూడు వేల ఎకరాల్లో వరిసాగుకు సరిపడేలా భూగర్భజలాలు పెరుగుతాయి. కానీ ఇదంతా పన్నెండేళ్ల క్రితం నాటి మాట.
2001లో ఈ చెరువు పూర్తిస్థాయిలో నిండింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా అలాంటి జలకళ లేదు. 2012లో వర్షాలు బాగానే కురిసినా కేవ లం ఆరడుగుల మేరకే నీళ్లొచ్చాయి. రబీ సీజన్‌లో కేవలం 300 ఎకరాలు మాత్రమే సాగుకు నోచుకుంది. ఈ ఏడాది వానాకాలంలో కేవలం పదడుగుల నీళ్లు వచ్చాయి. ఈ చెరువు కింది రైతులు 200 ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. మైనర్ ఇర్రిగేషన్ అధికారులు ఆ మేరకే నీళ్లివ్వగలమని చెప్పి సాగుకు నీళ్లు వదలడం ఆరంభించారు.
వర్షాలే దిక్కు..
ఈ పెద్దచెరువుకు నీళ్లు రావాలంటే మేడ్చల్, దుండిగల్, హకీంపేట, బొల్లారం పరిధిలో బాగా వాన కురవాలి. అక్కడి నుంచి వరదనీరొస్తేనే చెరువుకు కళ. రైతుకు భరోసా. కానీ ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ వర్షాలు కురియలేదు. నీటి రాక పెరగలేదు. వెరసి క్రమేణా చెరువు ఎండిపోతున్నది. గోదావరి జలాల్ని ఈ చెరువులోకి రప్పిస్తామని, కరువు లేకుండా చేస్తామని ఏళ్ల తరబడి పాలకులు యిస్తున్న హామీలు నీటిమూటలవుతున్నాయి. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు పేరుతో తొలుత ఆశలు కల్పించినా తర్వాత నీరుగార్చారు. ప్రాణహిత నుంచి శామీర్‌పేట పెద్ద చెరువుకు నీళ్లు తరలిస్తే తప్ప ఈ ప్రాంత రైతుల భూములు సాగుకు నోచుకునేట్టు లేవు. అప్పటి దాకా వర్షమే దిక్కు. భారీ వానలు కురిసినపుడే రైతులు గట్టెక్కినట్టు.

No comments:

Post a Comment